తెలంగాణా లో షర్మిల -లోకేష్ నువ్వా నేనా ....

ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉండి తెలంగాణలో రోజురోజుకు బలహీన పడుతున్న తమ పార్టీని కాపాడుకోవడం కోసం అధినేతల వారసులు రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల తెలంగాణ పార్టీ పగ్గాలు స్వీకరించారు. ఇదే సమయంలో అటు టీడీపీ కూడా తెలంగాణలో రోజు రోజుకు బలహీన పడుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ధాటికి విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇందుకోసం తనయుడు నారా లోకేష్ ను రంగంలోకి దింపుతున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా లోకేష్‌తో బస్సు యాత్రను జరిపించాలన్న యోచనతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలో యువతను పార్టీ వైపు మరింతగా ఆకర్షితులను చేసేందుకు నారా లోకేష్‌ యాత్ర ఎంతో దోహదపడుతుందని, రాష్ట్రంలో యాత్రను జరిపించేందుకు వీలుగా ఆయనను ఒప్పించాలని ఈ ప్రాంత నేతలు చంద్రబాబును అభ్యర్థించారు. ఎన్నికలకు ముందు యువతకు అనేక హామీలను గుప్పించి ఆ తర్వాత రిక్తహస్తం చూపించిన ప్రభుత్వ వైనాన్ని వివరించడంతోపాటు యువతను ఉద్యమం వైపు మళ్ళించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దశలవారీగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పర్యటించి పార్టీని పటిష్టపరచాలని నారా లోకేష్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే గ్రేటర్‌ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎలాంటి పరిస్థితుల్లో మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో తరచూ సమావేశమై గ్రేటర్‌ ఎన్నికల వ్యూహంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు బయలుదేరి వెళ్ళేముందు మరోమారు గ్రేటర్‌ ఎన్నికలపై ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని డివిజన్‌లవారీగా నేతలను ఎంపిక చేసి వారితోనూ భేటీ కావాలని లోకేష్‌ ప్రతిపాదించారు. మరోవైపు తెలంగాణలో షర్మిల ఓదార్పు యాత్ర చేయబోతున్నారు. పార్టీని పటిష్టపర్చే పనిలో భాగంగా ఆమె తెలంగాణ అంతటా పర్యటించాలని భావిస్తున్నారు. మొత్తానికి ఒకే సమయంలో వైసీపీ, టీడీపీ తమ ప్రయత్నాల్లో భాగంగా షర్మిలను, లోకేష్ ను బరిలోకి దింపాయి. మరి ఎవరు ఎక్కువ ప్రజలను తమ వైపుకు తిప్పుకుంటారో చూడాలి.