ఆ పాఠశాలలో ఒకే ఒక విద్యార్థిని ఒకే ఉపాధ్యాయుడు

కర్ణాటకలోని షిమోగా జిల్లా తీర్థహళ్లి తాలూకా అరాగా పరిధిలోని జెడికుని గ్రామంలో ఓ పాఠశాల ఉంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ విద్యనందించేందుకు ఏర్పాటైన ఆ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, పెద్ద వసారా, ఆట స్థలం, మరుగు దొడ్లు, రక్షిత మంచినీటితో పాటు ఆహ్లాదాన్నిచ్చే పచ్చిక బయలు కూడా ఉంది. అయితే ఈ సకల వసతుల మధ్య విద్యనభ్యసించేందుకు మాత్రం విద్యార్థులు లేరు. ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఒకే ఒక విద్యార్థిని సురశ్య, ఒకటో తరగతి చదువుతోంది. ఆమెకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు జయ కుమార్, నిత్యం తీర్థహళ్లి నుంచి వస్తూ, పోతుంటారు. గతేడాది దాకా ఐదుగురు విద్యార్థులుండేవారట. ఓ ఇద్దరు విద్యార్థులు ఐదో తరగతి పూర్తి చేసుకుని పోయారట. పోతూపోతూ, ఒకటి, మూడు తరగతుల్లోని తమ సోదరులను కూడా తీసుకెళ్లారట. దీంతో సురశ్య ఒక్కతే ఆ పాఠశాలలో మిగిలిపోయింది. స్థానికంగా పూజారిగా పనిచేసే ఆ బాలిక తండ్రి, సురశ్యను అక్కడే చదివిస్తున్నారట. ఇదిలా ఉంటే ఐదో తరగతి చదివే పిల్లలు మరో ఐదారు మంది గ్రామంలో ఉన్నప్పటికీ, వారంతా సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్నారు. ఇక తక్కువ మంది విద్యార్థులున్నారనే కారణంగా పాఠశాలలను ప్రభుత్వం మూసేస్తుందని ప్రజలు భావించారు. ఈ క్రమంలో ఆ పాఠశాలను మూయబోమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పింది.