బూతు వెబ్ సైట్లను మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోంది

తెలంగాణాలో బూతు వెబ్ సైట్లను మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మహిళలు, అమ్మాయిల మీద నేరాలు, రేప్‌లు, అత్యాచార యత్నాలు, అఘాయిత్యాలకు కళ్ళెం వేయాలంటే అశ్లీలసైట్స్‌ని మూసేస్తేనే బెటరని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. యువత ఈ సైట్స్‌ని అదేపనిగా చూస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నదని, పోర్నోగ్రఫీ పట్ల ఆకర్షితులవుతున్నారని భావిస్తున్న ప్రభుత్వం ఇక బూతుసైట్ల పని పట్టబోతోందని అంటున్నారు. దాదాపు 1350 అశ్లీల సైట్లను మూసివేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలంగాణ పోలీసు వ్యవస్థ లోని ఐటీ విభాగం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఎడల్ట్స్ ఓన్లీ సినిమాలు, వీడియోలు కూడా ఇంటర్నెట్ ప్రియులకు అందుబాటులో ఉండబోవు. పైగా లండన్, చైనా వంటి చోట్ల ఇలాంటి సైట్లమీద ఆయా ప్రభుత్వాలు నిషేధం విధించిన విషయాన్ని మహిళల భద్రత పై ఏర్పాటు చేసిన కమిటీ గుర్తు చేసింది. ఈ కమిటీ సర్కారుకు సమర్పించిన తన నివేదికలో ఇదే అంశాన్ని సిఫారసు చేసింది కూడా. బూతు సైట్లు చూడాలంటే కొన్ని నిర్దేశిత పదాలు ఉన్నాయని, వాటికోసం వెదికినా ఆ సైట్ దొరకకపోతే వెతకడం మానేస్తారని, అయితే అలా చేసేందుకు కేంద్ర సమాచార, ప్రసార , హోంశాఖల అనుమతి కావలసి ఉంది. ఆ పర్మిషన్ సులభంగా లభించగలదని ప్రభుత్వం చెప్తోంది.